టైటిల్ తమాషాగా అనిపిస్తోందా ? ఇందులోని విషయం కుడా అలానే ఉంటుంది.
ఇంతకీ విషయం ఏంటంటే, ఈ మధ్య 3వ తరగతి తెలుగు వాచకం లోని డా. మహీధర నళినీమోహన్ గారి గేయ కథ చూశాను, చాలా తమాషాగా అనిపించింది. దాన్ని మీతో పంచుకోవాలని ఇక్కడ రాస్తున్నాను.
విన్నపం : ఈ గేయకథను వాడుకోవడంలో రచయిత గారికి గాని, పబ్లిషరు గారికి గాని ఏమైన అభ్యంతరాలున్నట్లైతే, నాకు తెలిపిన ఈ గేయకథను ఈ బ్లాగునుండి తొలగించగలను.
ఉన్నట్లుండి బెల్లంలడ్డుకు
ఉడుకుబోత్తనం వచ్చేసింది.
రెక్కలు కట్టుక విధాత దగ్గర
కొక్క పరుగులో వచ్చిపడింది.
ఎగా దిగా ఆశ్చర్యంతో
చూచెను దేవుడు బెల్లంలడ్డును
విశేషమేమని అడిగేలోగా
విసురుగా ఏకరుపెట్టెను లడ్డు
దంతాలూడిన తాతయ్యాలకీ
ముసిముసి నవ్వుల పసిపిల్లలకీ
ఎల్లవారికీ నేనే లోకువ
ఇతరుల జోలీ శొంఠీ ఎరుగక
కుదురుగ గూట్లో కూర్చుని ఉంటే
వచ్చే పోయే ప్రతివాళ్ళూ నను
నోట్లో వేసుక పోవడమేనా?
మానవులెవ్వరు మర్యాదెరుగరు
మునుముందుగ నా అనుమతి కోరరు
గోళ్ళని గిల్లీ పళ్ళను కొరికీ
నే నగుపిస్తే నిలువు దోపిడీ!
ఈగలు, చీమలు, దోమలు, నుసమలు
యాక్కురారీ పెను బొద్దెంకలు
సకల కీటములు యథాశక్తి నను
సతాయించుకొని తింటూ ఉంటవి.
బుద్దీ, జ్ఞానం లేని కీటముల
పద్దతి ఇంతే లెమ్మనుకుందాం
జ్ఞానం కలిగిన మానవజాతికి
సైత మిదెక్కడి పోయ్యేకాలం?
బుగ్గలలోపల మగ్గుచునుందును
నోటిరోటిలో నుగ్గగుచుందును
ఎవ్వరికెన్నడు నెగ్గుదలంపని
నను వేధించుట సబబంటావా?
బ్రహ్మదేవుడు: "పసిడి ఛాయలో మిసమిసలాడే
పేరు వినగనే నోరూరింఛే
ఏడుపు నవ్వుగా ఇట్టే మార్చే
పిల్లలు మెచ్చే బెల్లంలడ్డూ!
ఎల్లరు మెచ్చే బెల్లంలడ్డూ
వెళ్ళవే త్వరగా ఇక్కడినుంచి
వెళ్ళకపోతే నిన్ను నోటిలో
వేసుకొనాలనిపించును, నాకే."
రచయిత : డా. మహీధర నళినీమోహన్
మూలం : కోటి తపస్సు గేయకథలు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి