5, ఆగస్టు 2013, సోమవారం

ఎందుకు పారేస్తాను నాన్నా! __ చాసో

విఙప్తి : ఈ టపాలో చాసో గారి కథలోని కొంత భాగాన్ని యథాతథంగా వాడుకోవడం జరిగింది. ఈ విషయం మీద ప్రచురణ కర్తలకి అభ్యంతరం ఉన్నట్లయితే నాకు తెలియచేసినవెంటనే  ఈ టపా నుండి ఆ అంశాన్ని తొలగించగలను.

         టీచర్  కథ కమామిషు పుస్తకం నందలి మొదటి కథ చాసో  గారి "ఎందుకు పారేస్తాను నాన్నా!" దీని మీద నా అభిప్రాయం ఈ టపాలో రాస్తున్నాను.

         చాసో గారి గురించి పరిచయం చేసే సాహసం నేను చేయదల్చుకోలేదు.ఈయన రచనా శైలి, కథనంలో ప్రత్యేకత సాహిత్యంతో కాస్తో కూస్తో సాన్నిహిత్యం ఉన్న వారందరికీ చిరపరిచితం. ఈయన కలం నుంచి జాలువారిన కథలు అనేకం.  ప్రతిదీ పాఠకుడి హృదయ తంత్రులను సుతారంగా మీటి భావోద్వేగాలను పలికించాయి. ఈయన ఎంచుకున్న కథావస్తువులన్నీ నిజజీవితంలో ప్రతి ఒక్కరికి ఎక్కడో అక్కడ తారసపడినవే.  ఎంత సామాన్యమైన విషయం అయినా కథారూపంలో దానిని చెప్పేటప్పుడు, ఆ సంఘటన ఎవరెవరిని ఎలా ప్రభావితం చేసిందో మన కళ్ళకు కట్టినట్లు చెప్పడం అంత సులువుకాదు.  బయటి నుంచి చూసినపుడు ఆ విషయం ఎంతో చిన్నదిగా కనిపిస్తుంది.  కానీ జీవితాల మీద దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందనేది చాసో కథల్లో మనకు తెలుస్తుంది.అలాంటి కథ ఈ "ఎందుకు పారేస్తాను నాన్నా!" కథ.  కథాంశం చాలా చిన్నదే, ఒక పేద కుటుంభంలోని తండ్రీ, కొడుకుల మధ్య సంఘర్షణ.  బడికి వెళ్ళి చదువుకోవాలనేదే కొడుకు కోరిక.  తన దగ్గర డబ్బు లేకపోవడం ఆ అబ్బాయిని బడికి పంపలేక పోతాడు తండ్రి..
   
     వేసవి సెలవుల అనంతరం పాఠశాల పునః ప్రారంభంలో కృష్ణుడి (కొడుకు) స్నేహితులందరూ పై తరగతులలో చేరి పాఠశాలకు వెళుతుంటారు.  వీధిలోనికి వచ్చి వారిని చూడలేక కృష్ణుడు ఇంట్లో ఉంటాడు.  కృష్ణుడి ఈ పరిస్ఠితిని రచయిత ఇలా చెప్పాడు."కృష్ణుడు వీధి ముఖం చూడకుండా మొగుడు చచ్చిన విధవలాగా ఇంట్లో దూరి కూచుంటున్నాడు."  ఈ వాక్యంలో కృష్ణుడి మానసిక స్థితిని మనం ఊహించుకోవచ్చు.
      ఇలాంటి స్థితిలో కృష్ణుడి నాన్న కృష్ణుడిని చుట్టల కోసం దుకాణానికి పంపుతాడు.  దుకాణానికి వెళ్ళాలంటే హైస్కూల్ దాటి వెళ్ళాలి.  పాఠశాల పరిసరాలు, తన సహాధ్యాయిలతో కృష్ణుడి సంభాషణ ఇవన్నీ కూడా కృష్ణుడికి చదువుపట్ల ఉన్న ఆసక్తి, తండ్రి ఫీజు కట్టలేక పోవడంవల్ల పాఠశాలకు దూరం కావడం వల్ల కలిగే వేదనను పాఠకుల కళ్ళకు కడతాయి.
       చివరిలో తండ్రి, కొడుకుల సంచాషణ, తండ్రి,  కొడుకును పాఠశాలకు పంపడానికి ఒప్పుకోవడం వంటి సన్నివేశాలు మన మనస్సులో ఆర్ధ్రతను నింపుతాయి. వారి సంభాషణను యఠాతథంగా ఇక్కడ పొందు పరుస్తున్నాను.

             "ఓరి వెధవా! చుట్టలు తెమ్మంటే ఇక్కడ దిగమారావేం?" అన్నాడు.
             "చూడు" అన్నాడు కృష్ణుడు
             "ఏమిట్రా చూడ్డం?" అన్నాడు తండ్రి.
             "పాపం కనపడదు"
             "ఏమిటిరా నీ శ్రాద్దం?"
             "నా శ్రాద్ధమే!"
             "ఏమిటిరా?"
             "వాళ్ళంతా బడికెళ్ళారు"
              అప్పుదు తండ్రికి కొడుకు మోహంలో విచార రేఖలన్నీ కనబడ్డాయి.
             "వెర్రి నాగమ్మా అదిరా! అన్నాడు.  కృస్ణుడికి ఆనకట్టలు తెగ్గొట్టుకుని దుఃఖం కొట్టుకొచ్చింది.  వెక్కివెక్కి చుట్టుకుపోతూ ఏడుపు మొదలెట్టాడు.  కొడుకు బాధంతా తండ్రికి భోధపడ్డాది.  కొడుకు బాధంతా తండ్రి  పడ్డాడు. 
            "చదువు మానిపించానని అంత బాధ పడుతున్నావా?  బడి వరండాలు పట్టుకుని దేవుళ్ళాడుతున్నావా  నాయినా పద ఇంటికి" అన్నాడు.
           "నేన్రాను!" అని భూమి బద్దలై పోయినంత గట్టిగా అరిచాడు.
           "ఏం చేస్తావురా?"
           "గోడకేసి బుర్ర బద్దలు కొట్టుకుంటాను!" అని ఇంకా గట్టిగా అరిచాడు.అంతపనీ చేస్తాడేమోనని వెళ్ళి తండ్రి  కౌగలించుకున్నాడు.
           "పద నాయనా ఇంటికి!" అన్నాడు
           "బడి నాది అని గట్టిగా కేకేశాడు.
           "నీదేనురా బాబూ!"
           "బడిలోకి తీసికెళ్ళు మరి"
           "తల తాక్కట్టు పెట్టుకునేనా బళ్ళో వేస్తాను ఇంటికి పద"
           "ఇప్పుడే వెయ్యి!"
          "డబ్బు చూసి వేస్తాను"
          "ఇంటికెళ్ళి లేదంటావు"
          "అన్నురా!"
          "ఐతే పుస్తకాలు ముందు కొను"
         "వెర్రి నాయినా! వాటికి మాత్రం డబ్బొద్దూ?"
         "ఒక్క పుస్తకం కొను"
          "ఏ పుస్తకం కొనమన్నావు?" 
        "ఇంగ్లీషు పుస్తకం కొను!"
        "కొందాం పద ఏడవకు నాయినా.  నేను చచ్చిపోయినా ఏడవకు!" అన్నాడు తండ్రి.  తండ్రి చెయ్యిని చంకలో  పెట్టుకుని గిలగిల కొట్తుకుని ఏడుస్తూ బడిలో స్తోర్సుకి తోవ తీశాడు.  తండ్రి దీర్ఘంగా ఆలోచించాడు.  చుట్టలు   మానేద్దామనుకున్నాడు.  ఎంత మానుదామనుకున్నా మానలేకపోతున్నాడు. చుట్టలు మానేస్తే కృష్ణుడి  జీతానికి సరిపోతుంది! ఇంకో విధముగా పాలుపోలేదు.

            "ఇందాకా చుట్టల్కిచ్చిన డబ్బులున్నాయా పారేశావా?" అనడిగేడు కొడుకుని.

          "ప....ప్ప....ప్పారీ లేదు జేబులో ఉన్నాయి.  ఎందుకు పారేస్తాను నాన్నా?"
              అన్నాడు కృష్ణుడు. 

            ఈ సంభాషణ చదివాక మీ కళ్ళలో నీళ్ళు తిరుగుంటాయి అనుకుంటా! కచ్చితంగా చదివి తీరాల్సిన కథ. 

4 కామెంట్‌లు: